Jagan: జగన్ తన కులం మాట తప్పదని అంటున్నారు, మిగతా కులాలు మాట తప్పుతాయా?: పవన్ కల్యాణ్
- రాయలసీమలో పవన్ పర్యటన
- తిరుపతిలో న్యాయవాదులతో సమావేశం
- జగన్, వైసీపీ నేతలపై విమర్శలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా తిరుపతిలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'జగన్ జైల్లో ఉండి బయటికివచ్చిన తర్వాత మొండిగా తిరిగి సీఎం అయినప్పుడు, ప్రజాసమస్యలపై మొండిగా నేనెందుకు తిరగలేను?' అంటూ వ్యాఖ్యానించారు. తన మతం మానవత్వం అని, తన కులం మాట తప్పదని జగన్ అంటున్నారు, మరి మిగతా కులాలు మాట తప్పుతాయా అని పవన్ ప్రశ్నించారు. మిగతా మతాలు మానవత్వం నేర్పడం లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటూ మండిపడ్డారు.
అంతేకాకుండా వైసీపీ మంత్రులపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. చట్టాలు కాపాడాల్సిన మీరే పిచ్చికూతలు కూస్తుంటే రోడ్లపైన తిరిగే నలుగురు కుర్రాళ్లకు అమ్మాయిని చూస్తే మానభంగం వంటి ఆలోచనలు రాక ఇంకేం వస్తాయని ప్రశ్నించారు. సమస్యలు కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోలేనని, మనస్సాక్షితో సమస్యల పట్ల స్పందిస్తానని తెలిపారు. సమస్యలు ఎదురైతే కళ్లకు గంతలు కట్టుకుని ఉండలేనని అన్నారు. తాను రాజకీయాల్లోకి తెగించే వచ్చానని స్పష్టం చేశారు.
న్యాయవాదుల సమస్యలపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని, కోర్టుల వద్ద న్యాయవాదులకు సరైన సదుపాయాలు లేవని అభిప్రాయపడ్డారు. దేశం కోసం చచ్చిపోవడానికైనా సిద్ధంగా కొందరున్నారని చెప్పడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.