Polavaram: పోలవరం నుంచి విశాఖకు నీటి పంపిణీపై అధికారులతో చర్చించిన సీఎం జగన్
- విశాఖ నగరాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష
- హాజరైన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు
- పరిశ్రమల కోసం డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న సీఎం
ఏపీ సీఎం జగన్ విశాఖ నగరాభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో ముఖ్యంగా విశాఖ నగర తాగునీటి అవసరాలు, లభ్యతపై చర్చించారు.
పోలవరం నుంచి పైప్ లైన్ ద్వారా నేరుగా విశాఖకు నిరంతర నీటి సరఫరాపై అధికారులకు సూచనలు ఇచ్చారు. పోలవరం వద్దే నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా నగరానికి తరలించాలని ఆదేశించారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవని రీతిలో ఏర్పాట్లు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు అధిక నీటి వ్యయం అవుతుంది కాబట్టి, వాటికోసం ప్రత్యేకంగా డీశాలినేషన్ (సముద్రపు నీటి నుంచి లవణాల తొలగింపు) ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.