Onion: ఉల్లి పంట మాయం... ఏకంగా చేనులో నుంచే చోరీ!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- రూ. 30 వేల పంట దొంగతనం
- పోలీసు కేసు నమోదు
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగి, కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న వేళ, ఉల్లిపాయల కోసం దొంగతనాలూ పెరిగిపోయాయి. మార్కెట్ల నుంచి ఉల్లి దొంగతనం కేసులు ఇంతవరకూ నమోదుకాగా, ఇప్పుడు ఏకంగా ఉల్లి పంటకు కూడా రక్షణ లేకుండా పోయింది. మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లో ఉల్లి పంటను పొలంలోనే కోసేసుకుని వెళ్లిపోయారు దొంగలు.
ఓ రైతు ఉల్లి పంటను వేసుకుని, నేడో, రేపో కోత కోయాలని అనుకుంటున్న వేళ ఈ ఘటన జరిగింది. ఉల్లి కాడలు సహా దొంగిలించిన పంట ఖరీదు రూ. 30 వేలకు పైగా ఉంటుందని రైతు జితేంద్ర కుమార్ వాపోయాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దొంగలు ఎవరన్న విషయాన్ని కనిపెట్టేందుకు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఉల్లిపాయల ధర కిలోకు రూ. 100 వరకూ పలుకుతోన్న సంగతి తెలిసిందే.