Sharad Pawar: బీజేపీ కంటే శివసేనతో కలిసి పనిచేయడమే ఈజీ: శరద్ పవార్
- బీజేపీతో పని చేయడం సిద్ధాంతపరంగా కష్టతరం
- శివసేన తన హిందుత్వను పరిపాలనలోకి తీసుకురాదు
- కాంగ్రెస్ తో మాకు ముందు నుంచి పొత్తు ఉంది
బీజేపీతో కలిసి పని చేయడం సిద్ధాంతపరంగా చాలా కష్టతరమైనదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. శివసేన కూడా హిందుత్వ భావజాలం కలిగిన పార్టేనే అయినప్పటికీ... బీజేపీ కంటే శివసేనతో కలిసి పని చేయడమే ఈజీ అని చెప్పారు. ఎందుకంటే, శివసేన తన హిందుత్వను పరిపాలనలోకి తీసుకురాదని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మధ్య కుదిరిన మినిమమ్ కామన్ ప్రోగ్రామ్ లో ఉందని... సంకీర్ణ ప్రభుత్వానికి ఇదే కీలకమైన అంశమని చెప్పారు.
ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా కలిసి పనిచేద్దామని ఆయన ప్రతిపాదించారని... అయితే విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన నేపథ్యంలో అది సాధ్యం కాదని తాను చెప్పానని శరద్ పవార్ తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇస్తామని... కానీ, రాజకీయాలను అందులోకి లాగకూడదని అన్నారు. తమది కూడా ఒక రాజకీయ పార్టీనేనని చెప్పారు. కాంగ్రెస్ తో తమకు పొత్తు ఉందని... దాన్ని, విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన తనకు లేదని తెలిపారు.