Pawan Kalyan: హిందూ ధర్మానికి ఏ మాత్రం నష్టం కలిగేలా ప్రవర్తించినా నేను మాట్లాడతాను: పవన్ కల్యాణ్ ఆగ్రహం
- నేను పాటించే హిందూమతానికి అన్యాయం జరిగినప్పుడు స్పందిస్తా
- దీనివల్ల ఓట్లు వస్తాయా? ఓట్లు పోతాయా? అన్న విషయం తెలియదు
- కానీ, భారత రాజ్యాంగ పరిధిలోనే నేను పోరాడతాను
వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'వేరే మతానికి అన్యాయం జరుగుతుంటే ఎలా స్పందిస్తానో, అలాగే, నేను పాటించే హిందూమతానికి అన్యాయం జరిగినప్పుడు కూడా అలాగే స్పందిస్తాను. దీనివల్ల ఓట్లు వస్తాయా? ఓట్లు పోతాయా? అన్న విషయం నాకు తెలియదు. కానీ, భారత రాజ్యాంగ పరిధిలోనే నేను పోరాడతాను' అని చెప్పారు.
'హిందూ ధర్మానికి ఏ మాత్రం నష్టం కలిగేలా ప్రవర్తించినా నేను మాట్లాడతాను. కడప దర్గాకు పోయి ఏ హిందువూ జై భవానీ అనడు. మెదక్ చర్చిల వద్దకు వెళ్లి జై శ్రీరామ్ అనడు. మరి అలాగే, హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్లి జై జీసస్ అనకూడదు. అది ధర్మ విరుద్ధం. దీన్ని కచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకిలా చేస్తున్నారు? అన్యమత ప్రచారం వద్దు' అని పవన్ వ్యాఖ్యానించారు.
'విజయవాడ కనకదుర్గ ఆలయం ఎదురుగా ఉండే పుష్కర ఘాట్ లో సామూహిక మతమార్పిడులు జరుగుతుంటే అవి వైసీపీ నేతలకు కనపడట్లేదు. నా మాటలను వక్రీకరించి వ్యాఖ్యలను కట్ చేసి వైసీపీ ప్రచారం చేస్తోంది. మీరందరు హిందువులు కాదా? తాము హిందువులము అని చెప్పుకునే నేతల గురించి నేను ఇటీవల మాట్లాడాను. నా మాటలను ఎందుకు వక్రీకరించారు?' అని పవన్ ప్రశ్నించారు. హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే ఆ నేతలు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. తాను ధర్మం, సత్యాల గురించి మాట్లాడడానికి భయపడే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు.