Jana Sena: ఆంగ్ల మాధ్యమం విషయంలోనూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు: పవన్ కల్యాణ్

  • పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలి
  • తెలుగు భాషకు సంబంధించి నేను నా తీరును స్పష్టం చేశాను
  • తెలుగు మీడియం ఆప్షన్ ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు

ఆంగ్ల మాధ్యమం విషయంలోనూ తన వ్యాఖ్యలను వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... 'పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలి.  ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి నేను నా తీరును స్పష్టం చేశాను. రాయలసీమ వంటి గొప్ప తెలుగు నేలకు చెందిన బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి వ్యక్తి తెలుగు భాషను పరిరక్షించట్లేదు' అని అన్నారు.

'తెలుగు భాషను పరిరక్షించండి అని  అడిగితే దాన్ని కూడా వక్రీకరించారు. ఇంగ్లిషు మీడియం వద్దని అంటున్నారని వక్రీకరిస్తూ ప్రచారం చేశారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవద్దట అని ప్రజలతో అంటున్నారు. ఇంగ్లిషు మాధ్యమం అవసరమే. అయితే, తెలుగు మీడియం అనే ఆప్షన్ ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు' అని పవన్ తెలిపారు.

'ఉర్దు మీడియంతో పాటు ఇతర భాషలను కూడా తీసేని, ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారా? అన్న విషయంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుని మాత్రమే చులకన చేసి ఈ భాషలో బోధనను మాత్రమే తీసేస్తున్నారా?' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కనీసం ఉల్లిపాయల ధరలను కూడా నియంత్రించలేకపోతున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News