Janasena: పవన్ వ్యాఖ్యలపై ప్రజలు నవ్వుకుంటున్నారు: హోం మంత్రి సుచరిత
- అత్యాచార నిందితులకు బెత్తం దెబ్బలు చాలా?
- ఒక పార్టీకి నాయకుడైన పవన్ ఇలా మాట్లాడతారా?
- మహిళలపై ఆయనకు ఏపాటి గౌరవం ఉందో తెలుస్తోంది
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష అవసరం లేదని, అందరూ చూస్తుండగా వారికి రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత స్పందిస్తూ, పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మహిళలపై ఏపాటి గౌరవం ఉందో చెబుతాయని అన్నారు.
ఒక మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన ఘటనపై తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశ ప్రజలు ఖండించడమే కాకుండా క్రూరమైన శిక్ష వేయాలని చెబుతున్న తరుణంలో రెండు బెత్తం దెబ్బలు చాలన్న పవన్ వ్యాఖ్యలపై మహిళలందరూ ఆలోచించాలని కోరారు. మహిళలకు భద్రత కరువవుతోందని ఆందోళన చేస్తుంటే ఒక పార్టీకి నాయకుడైన పవన్ ఇలా మాట్లాడటం తగదని అన్నారు.
చట్టాలను గౌరవించాలని ఒకపక్క చెబుతూనే, చెమడాలు ఊడేట్టు నిందితులను కొట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శించారు. పవన్ వ్యాఖ్యలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని, ఒకవేళ ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే ఎలా వుంటుందని ఆలోచించుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్దపీట వేశారని చెప్పారు. సైబర్ మిత్ర, మహిళా మిత్ర, బీ సేఫ్ యాప్ ను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. దిశ ఘటనతో జగన్ చలించిపోయారని, మన రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్ ను తీసుకురావాలని యోచిస్తున్నట్టు సుచరిత వెల్లడించారు.