pleading with President to become 'executioner' – Nirbhaya case convicts: ‘నిర్భయ’ దోషుల ఉరితీతకు నన్ను తలారిగా నియమించండి: హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి అభ్యర్థన
- రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ
- తమకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ.. నిందితుల అభ్యర్థన
- హోం శాఖకు చేరిన క్షమాభిక్ష పిటిషన్
దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుకు తనను తలారిగా అనుమతించాలంటూ.. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి రాష్ట్రపతికి లేఖ రాశారు.‘ తీహార్ జైల్లో తాత్కాలిక తలారిగా నన్ను నియమించండి. నిర్భయ దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయడానికి వీలవుతుంది. నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుంది’ అని తన లేఖలో అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా, నిర్భయ కేసులో నిందితుడు వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన కేంద్ర హోంశాఖకు చేరింది. ఇప్పటికే ఈ అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడు కేంద్ర ప్రభుత్వానికి తన క్షమాభిక్ష పిటిషన్ ను పంపించాడు. ఈ పిటిషన్ ను అందుకున్న హోంశాఖ త్వరలోనే దాన్ని రాష్ట్రపతికి పంపనుంది.
రాష్ట్రపతి వీరి క్షమాభిక్షను తిరస్కరిస్తే.. జైలు అధికారులు వీరికి ఉరిశిక్షను అమలు చేస్తారు. తీహార్ జైలులో తలారీలు లేకపోవడంతో.. అధికారులు శిక్ష అమలును ఎలా చేయాలా? అని ఆలోచిస్తున్న నేపథ్యంలో రవికుమార్ తాను తలారీగా పనిచేస్తానని ముందుకు రావడం గమనార్హం.