Disha: సీక్రెట్ గా తెల్లవారుజామున చర్లపల్లి జైలు నుంచి దిశ నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు!
- తెల్లవారుజామున సీన్ రీకన్ స్ట్రక్షన్
- 3.45 గంటల నుంచి గంటన్నర పాటు విచారణ
- నిందితులను రహస్యంగా విచారిస్తున్న పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు చకచకా అడుగులు వేశారు. వాస్తవానికి నేడు వారిని కస్టడీలోకి తీసుకుంటారని అందరూ భావించగా, సైబరాబాద్ పోలీసులు సీక్రెట్ గా కదిలారు. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో చర్లపల్లి జైలు నుంచి నిందితులను తమ అధీనంలోకి తీసుకుని, ముందుగా ఘటనాస్థలికి వెళ్లి సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు.
ఇటువంటి కేసుల్లో వారు ఏం చేశారు? ఎలా చేశారన్నది అత్యంత కీలకం కావడంతోనే ముందుగా ఆ పనిని ముగించాలని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. పోలీసుల కస్టడీలో నిందితులు ఉన్నారని తెలిస్తే, ఈ వారం రోజుల్లో ఏదో ఓ సమయంలో ఘటనాస్థలికి వారిని తీసుకు వస్తారన్న అంచనాతో ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఏదైనా ఉద్రిక్త పరిస్థితులను కల్పించవచ్చన్న భావనలో ఉన్న పోలీసులు ముందే ఆ పని ముగించేశారు. ఆపై దిశ మొబైల్ ఫోన్ ను నాశనం చేశామని నిందితులు చెప్పిన స్థలానికి కూడా పోలీసులు వాళ్లని తీసుకువెళ్లారని తెలుస్తోంది.
తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న పోలీసులు, దాదాపు గంటన్నర సమయంలో తమ పనిని ముగించారు. స్కూటీని ఎక్కడ, ఎలా పంక్చర్ చేశారన్న విషయం నుంచి, ఆమెను బంధించి, లారీ ఎలా ఎక్కించారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఎలా హత్య చేశారన్న మొత్తం విషయాన్ని వారితో చెప్పించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని భావిస్తున్న పోలీసులు, విచారణను రహస్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం నిందితులను ఎక్కడ ఉంచారన్న విషయాన్ని కూడా వెల్లడించడం లేదు.