Andhra Pradesh: ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు
- వీరులపాడు మండలానికి చెందిన బాలుడి కిడ్నాప్
- కంచికచర్ల పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి
- తమ పరిధి కాకపోయినా ఫిర్యాదు స్వీకరించిన కంచికచర్ల పోలీసులు
తెలంగాణలో దిశ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది. పరిధితో సంబంధం లేకుండా ఫిర్యాదు స్వీకరించి నమోదు చేసుకునే విధానమే జీరో ఎఫ్ఐఆర్. ఈ తరహాలో ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. తన కుమారుడ్ని కిడ్నాప్ చేశారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన రవినాయక్ అనే వ్యక్తి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ పరిధి వెలుపలి వ్యవహారం అయినా కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకోవడమే కాదు, బాలుడు తెలంగాణలో ఉన్నట్టు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. విచారణలో భాగంగా రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు తీవ్రంగా శ్రమించి బాలుడు మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. మొత్తమ్మీద ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, తొలి కేసును పోలీసులు ఎంతో బాధ్యతగా చేపట్టి విజయం సాధించారు.