Amaravathi: రాజధాని ప్రాజెక్టు తప్పు అని ప్రజలు అంటే క్షమాపణలు చెబుతా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
- ప్రజలకు అవగాహన కల్పించటమే ఈ సమావేశ లక్ష్యం
- రాజధాని అనేది ప్రజల భవిష్యత్ కు సంబంధించింది
- ‘ప్రజా రాజధాని అమరావతి’పై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు
‘ప్రజా రాజధాని అమరావతి’పై విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, రాజధానిపై ప్రజలకు అవగాహన కల్పించటమే ఈ సమావేశ లక్ష్యమని అన్నారు.
రాజధాని అనేది ప్రజల భవిష్యత్ కు సంబంధించిన విషయమని, దీన్ని ముందుకు తీసుకెళ్లకపోతే యువత తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. దీటైన నగరం లేకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు తప్పు అని ప్రజలు అంటే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానంటూ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన అభివృద్ధిని ‘గ్రాఫిక్స్’ అని ఎగతాళి చేశారని వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. హైదరాబాద్ కంటే గొప్పగా అమరావతి నిర్మాణం చేద్దామనుకున్నానని, ప్రపంచ రాజధానుల్లో ఒకటిగా అమరావతి వుండాలని తన హయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని అన్నారు.