Amaravathi: రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేయాలి: సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్
- రాజధానిపై మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు
- రాజధానిని శ్మశానంతో పోల్చుతారా?
- అభివృద్ధికి తూట్లు పొడవడం సబబు కాదు
ఏపీ రాజధాని గురించి అందరికీ అర్థమయ్యేలా చంద్రబాబునాయుడు చెప్పారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని గురించి మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారని, రాజధానిని శ్మశానంతో పోల్చారని మండిపడ్డారు.
రాజధాని భూములపై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ, ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఈ ఆరోపణలపై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ప్రజా రాజధానిని ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది సంతోషమే కానీ, అభివృద్ధికి తూట్లు పొడవడం సబబు కాదని అన్నారు. అమరావతిలో చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై ఇటీవల చేసిన దాడిని ఆయన ఖండించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరగడం సరికాదని అన్నారు.