Telangana: మహిళలపై ఈ దారుణాలకు మద్యమే కారణం: భట్టి విక్రమార్క
- హైదరాబాద్ లో రెండేళ్లలో 4 వేల మంది అమ్మాయిల జాడ లేదు
- దిశ దుర్ఘటన దిగ్ర్భాంతికి గురి చేసింది
- భట్టి అధ్యక్షతన సీఎల్పీ ప్రత్యేక సమావేశం
దిశ దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని, గత రెండు సంవత్సరాలలో రాజధాని హైదరాబాద్ లో 4 వేల మంది అమ్మాయిలు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహిళలపై దాడులు, ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆయన అధ్యక్షతన సీఎల్పీ ప్రత్యేక సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ, రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు ప్రజలను భయానికి గురి చేస్తున్నాయని, మహిళలపై దాడి నిందితులకు ఉరి శిక్షే సరైనదని అన్నారు. మద్యం అమ్మకాలే వీటికి ప్రధాన కారణమని, విచ్చలవిడి అమ్మకాలతో పాటు బెల్టు షాపుల నిర్వహణ కూడా నేరాల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయన్నారు. ప్రభుత్వం కూడా కేవలం ఆదాయ కోణంలోనే మద్యం అమ్మకాలను చూస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ లలో కేసుల నమోదు, విచారణ, టీఆర్ఎస్ నేతల కనుసన్నలలోనే నడుస్తోందని, పోలీసులు ఉన్నది ప్రజల కోసమని కొద్దిగా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఆర్టీసీకి 1000 కోట్ల రూపాయలు ఇస్తుందని ముందు చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఆ భారాన్ని ఛార్జీల పెంపు రూపంలో ప్రజలపైకే నెట్టి వేశారని ఆరోపించారు.