Rythu Bazarlu: సబ్సిడీ ఉల్లికి 14 కోట్లు ఖర్చు చేశాం: ఏపీ మంత్రి మోపిదేవి
- పట్టణాలలోని రైతు బజార్లలో విక్రయం
- కొరత వల్లే గ్రామాల్లో ఇవ్వలేక పోతున్నాం
- ఈరోజు షోలాపూర్ లో రూ.115 కి కొన్న అధికారులు
ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను తీర్చడానికి సబ్సిడీపై 25 రూపాయలకే కేజీ ఉల్లిపాయలను అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఏపీ మార్కెటింగ్ మరియు మత్స్య శాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ, రైతు బజార్ల ద్వారా పట్టణాల్లోని వినియోగ దారులకు సబ్సిడీపై రూ.25కే కేజీ ఉల్లిని సరఫరా చేస్తున్నామని, ఇందు కోసం మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తగినంత స్టాక్ అందుబాటులో లేదని, అందుకే గ్రామాలలో రేషన్ షాపుల ద్వారా ఉల్లిని పంపిణీ చేయలేకపోతున్నామని చెప్పారు. ఈరోజు కూడా మహారాష్ట్రలోని షోలాపూర్ మార్కెట్లో 115 రూపాయల ధరకు మన అధికారులు ఉల్లిని కొనుగోలు చేశారని, అయినప్పటికీ తగినంత దొరకలేదని అన్నారు.