KTR: దిశ నిందితులను ఉరి తీయాలన్నంత ఆవేశం, ఆవేదన నాలోనూ ఉన్నాయి: కేటీఆర్
- దిశ ఘటనపై కేటీఆర్ వ్యాఖ్యలు
- ఓ ప్రజాప్రతినిధిగా అలా అనలేనని వ్యాఖ్యలు
- నిర్భయ నిందితులకి ఇప్పటికీ ఉరిశిక్ష అమలు కాలేదన్న కేటీఆర్
దిశ హత్యోదంతం జరిగి రోజులు గడుస్తున్నా, ఆ ఘటన రగిల్చిన జ్వాలలు ఇంకా ఆరలేదు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. దిశ కేసులో నిందితులను ఉరితీయాలని అంతా అంటున్నారని తెలిపారు. వారిని ఉరితీసి చంపాలన్నంత ఆవేశం, ఆవేదన తనలోనూ ఉన్నాయని, కానీ ఓ ప్రజాప్రతినిధిగా అలా అనలేనని పేర్కొన్నారు. నిర్భయ ఘటనలో నిందితులకు ఇప్పటికీ ఉరిశిక్ష అమలు కాలేదని, ఉగ్రవాది కసబ్ ను ఎన్నేళ్లు జైల్లో ఉంచారో చూశామని వివరించారు. ఇలాంటి ఘటనల్లో సత్వరమే శిక్ష పడేలా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అంతేగాకుండా, దేశంలో పరిస్థితులు, అధికారుల గురించి కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రాకముందు తాను ఓ ప్రైవేట్ ఉద్యోగినని, రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ వేలాది గ్రామాలకు కరెంట్, నీళ్లు, రోడ్లు లేవని అన్నారు. ఓవైపు వందలాది ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్న మనదేశానికి రెండోవైపు కూడా చూడాలని పేర్కొన్నారు. అధికారుల గురించి మాట్లాడుతూ, సర్వీస్ లో చేరిన కొన్నేళ్లకే మైండ్ సెట్ మారుతున్న అధికారులు ఉన్నారని, ఎన్నేళ్లైనా పాజిటివ్ గా ఉన్న అధికారులను కొందరినే చూశానని కేటీఆర్ వెల్లడించారు.