IMS: ఈఎస్ఐ స్కాంలో మరిన్ని నిజాలు వెలుగులోకి.. డాక్టర్ దేవికారాణి ఆస్తులు రూ.100 కోట్లకుపైనే!
- బుధవారం కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న విచారణాధికారులు
- లంచాల సొమ్ముతో దేవికారాణి భర్త లావాదేవీలు
- నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన వైనం
హైదరాబాద్ ఈఎస్ఐలోని బీమా వైద్య సేవల (ఐఎంఎస్) విభాగంలో కుంభకోణం సూత్రధారి అయిన డాక్టర్ దేవికారాణి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమెను మూడుసార్లు కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. ఆమె అక్రమాస్తుల చిట్టా చూసి నోరెళ్లబెడుతున్నారు.
బుధవారం మరోసారి హైదరాబాద్, తిరుపతి, కడప ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు స్థిరాస్తులకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.15 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్ల రూపాయలకు పైమాటేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పీఎంజే జ్యుయెలరీలో నిందితురాలు డాక్టర్ దేవికారాణి రూ. 7.3 కోట్లు విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించారు.
మరోవైపు, ఐఎంఎస్లోనే సివిల్ సర్జన్‌గా పనిచేసి, రిటైరైన దేవికారాణి భర్త పి.గురుమూర్తి భార్య తరపున వసూలు చేసిన లంచాల సొమ్ముతో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. గురువారం ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను జ్యూడీషియల్ రిమాండ్ కోసం చంచల్‌గూడ జైలుకు తరలించారు.