Encounter: పోలీసుల ఆయుధాలు లాక్కొని పారిపోబోయిన ఆరిఫ్, శివ... వారితోపాటే పరిగెత్తిన నవీన్, చెన్నకేశవులు!
- ముగిసిన నిందితుల కథ
- లాక్కున్న ఆయుధాలతో దాడికి దిగే ప్రయత్నం
- ఆత్మరక్షణ నిమిత్తం ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితుల కథ ముగిసింది. ఈ కేసులో నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. తమ విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ నిమిత్తం వారిని ఘటనా స్థలికి తీసుకు వెళ్లిన వేళ, తమలోని నేరగుణాన్ని నిందితులు బయటపెట్టారు. పోలీసుల నుంచే ఆయుధాలు లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆరిఫ్, శివలు పోలీసుల నుండి రెండు తుపాకులు లాక్కుని పరిగెత్తుతుండగా, మిగతా ఇద్దరు నిందితులు నవీన్, చెన్నకేశవులు వారిని అనుసరించారు. ఈ ఘటన చటాన్ పల్లి జాతీయ రహదారి వంతెన కింద, ఎక్కడైతే దిశను కాల్చి చంపారో అక్కడే జరిగింది. లొంగిపోవాలని, లేకుంటే కాల్చేయాల్సి వుంటుందని పోలీసులు అరుస్తున్నా వినలేదు.
ఇదే సమయంలో తాము లాక్కున్న ఆయుధాలతో పోలీసులపైనే దాడికి దిగేందుకు నిందితులు ప్రయత్నించడంతో, పోలీసులు కాల్పులు జరపక తప్పలేదు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులూ మరణించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని అధికారుల కమిటీ విచారణ జరిపి తేలుస్తుందని వెల్లడించారు.