Temparature: ఈ ఏడాది చలిపులి దాడి అంతంతే: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

  • ఏటా జనవరి నెలలో పలుచోట్ల 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు 
  • ఈ ఏడాది అలా ఉండకపోవచ్చునని అంచనా 
  • ఇప్పటికే పలుచోట్ల నాలుగు నుంచి ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు

డిసెంబర్ ప్రవేశంతోనే తెలుగు రాష్ట్రాలను చలి వణికించడం పరిపాటి. ఈ ఏడాది కూడా అప్పుడే చలి చంపేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు కొంత పర్వాలేదన్నట్లు ఉన్నా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం పడిపోతున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈ ఏడాది చలి అంతగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చునంటున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు.

గతంలోలా నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పది డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. జనవరి నెలలో ఏకంగా నాలుగైదు డిగ్రీలు నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, ఆంధ్రాలోని విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈ ఏడాది పరిస్థితిలో తేడా కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబరు 4న ఆదిలాబాద్ జిల్లాలో 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఈ ఏడాది 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మెదక్ లోనూ నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయింది.

ఇక విశాఖ జిల్లా లంబసింగిలోనూ గత ఏడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు, ఆకాశం మేఘావృతం అవుతుండడం వల్లే ఈ పరిస్థితి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News