Encounter: నలుగురు నిందితుల తల్లిదండ్రులనూ శంషాబాద్ కు తరలించిన పోలీసులు!
- పూర్తయిన శవ పంచనామా
- ఘటనా స్థలిలోనే పోస్టుమార్టం
- ఆపై మృతదేహాల అప్పగింత
ఈ ఉదయం చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఎక్కడైతే దిశను సజీవ దహనం చేశారో, అక్కడికి 300 మీటర్ల దూరంలో నలుగురు నిందితులనూ ఎన్ కౌంటర్ లో హతమార్చిన పోలీసులు, వారి తల్లిదండ్రులను శంషాబాద్ కు తీసుకుని వచ్చారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇప్పటికే శవ పంచనామా పూర్తి కాగా, వారి తల్లిదండ్రులు, ముఖ్య బంధువుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను వారికి అప్పగించాలని పోలీసులు భావిస్తున్నారు.
ఆపై సాయంత్రంలోగా వారికి అంత్యక్రియలను ఎవరి సంప్రదాయాల ప్రకారం వారు నిర్వహించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. తమ బిడ్డలను కోల్పోయామన్న బాధ ఉన్నప్పటికీ, వారు చేసిన దుర్మార్గాన్ని తలచుకుంటే, మరింత బాధ వేస్తోందని శివ తల్లి వ్యాఖ్యానించారు. తన కుమారుడిని కోర్టు శిక్షిస్తుందని భావించామని, పోలీసులే ఇలా శిక్ష విధిస్తారని అనుకోలేదని చెన్నకేశవులు తండ్రి వ్యాఖ్యానించారు.