Guntur District: ఆత్మకూరులో టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేయండి: హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పిల్
- ఈ భవనం అక్రమ నిర్మాణం
- 2017లో జారీ చేసిన జీవోను రద్దు చేయాలి
- పిల్ దాఖలు చేసిన మంగళగిరి వైసీపీ నేత ఆర్కే
గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం నూతన భవనానికి ఇవాళ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తన భార్య బ్రాహ్మణితో కలిసి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ భవనం అక్రమనిర్మాణం, అని, దానిని కూల్చి వేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ఇవాళ దాఖలు చేశారు.
ఆత్మకూరు పరిధిలోని వాగు పోరంబోకుకు చెందిన సర్వే నెంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం నిమిత్తం తొంభైతొమ్మిది సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని తన పిటిషన్ లో ఆర్కే ఆరోపించారు. ఈ జీవోను రద్దు చేయడంతో పాటు టీడీపీ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేసి తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా సీఆర్డీఏ కమిషషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని ఆర్కే తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.