Telugudesam: ఉల్లిని కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి: చంద్రబాబు
- ఏపీలో నిత్యావసరాల ధరలు మండి పోతున్నాయి
- వైసీపీ ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైంది
- రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని.. అటకెక్కించారా?
ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందన్నారు. ఉల్లి ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే.. దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో ధరల పెరుగుదల ఒక్క ఉల్లికే పరిమితం కాలేదంటూ.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటుతున్నాయని పేర్కొన్నారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారంటూ.. అది ఏమైందని ప్రశ్నించారు. ఉల్లిని కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయన్నారు. ఉల్లి ధరల తడాఖా ఏమిటో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు చూపిస్తారన్నారు.