ICU: ఐసీయూలో ఉన్న అమ్మాయిని పెళ్లాడి.. కాసేపటికే ముఖం చాటేశాడు!
- పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
- విషం తాగిన ప్రేయసి
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రేయసిని పెళ్లాడిన ఓ యువకుడు కాసేపట్లోనే తన నిజస్వరూపం బయటపెట్టుకున్నాడు. పెళ్లికి నిరాకరించాడన్న కారణంతో మహారాష్ట్రలో ఓ యువతి కొన్నిరోజుల కిందట విషం తాగగా, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి క్షీణిస్తోందన్న సమాచారంతో ప్రియుడు సూరజ్ నల్వాడే ఐసీయూలోనే తాళి కట్టాడు.
కానీ దండలు మార్చుకుని, తాళి కట్టి ఫొటోలకు పోజులిచ్చిన కాసేపటి తర్వాత అక్కడి నుంచి ఉడాయించాడు. దాంతో హతాశురాలైన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడి పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడని, అందుకే విషం తాగానని వెల్లడించింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని పరారయ్యాడంటూ వాపోయింది. పెళ్లికి కులం అడ్డొస్తోందని చెప్పేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.