Virat Kohli: కోహ్లీ సిక్సర్ల మోత... భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా

  • ఉప్పల్ మ్యాచ్ లో భారత్ జయభేరి
  • కోహ్లీ 94 నాటౌట్
  • 208 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించిన భారత్

కెప్టెన్ విరాట్ కోహ్లీ (94 నాటౌట్) దూకుడుకు కళాత్మకత జోడించి ఆడిన మెరుపు ఇన్నింగ్స్ తో టీమిండియా తొలి టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 208 పరుగుల లక్ష్యఛేదనలో కోహ్లీ, రాహుల్ (62), పంత్ (18) రాణించడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపుతీరాలకు చేరింది. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ ఆటతీరే హైలైట్. ఈ ఢిల్లీ డైనమైట్ కేవలం 50 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 6 సిక్సులున్నాయంటే విధ్వంసం ఏ రీతిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

రోహిత్ శర్మ (8) మొదట్లోనే అవుటైనా రాహుల్ తో కలిసి కోహ్లీ ఎక్కడా వేగం తగ్గకుండా ఆడాడు. అర్ధసెంచరీ అనంతరం రాహుల్ అవుటైనా, పంత్ జతగా ఇన్నింగ్స్ నడిపించాడు. ఆఖర్లో రెండు భారీ సిక్స్ లతో మ్యాచ్ ను ముగించి తానెందుకు ప్రత్యేకమో చాటిచెప్పాడు. ఈ విజయంతో టీమిండియా మూడు టి20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇక రెండో టి20 మ్యాచ్ డిసెంబరు 8న తిరువనంతపురంలో జరగనుంది.

  • Loading...

More Telugu News