Tamilnadu: ఊళ్లో మగాడు.. బస్తీకొస్తే మహిళ.. తల్లిదండ్రులను పోషించుకునేందుకు యువకుడి పడరాని పాట్లు!
- తమిళనాడులోని మదురైలో ఘటన
- ఆడవేషంలో పాచిపనులు
- వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకునేందుకేనన్న రాజా
తల్లిదండ్రులను పోషించుకునేందుకు తమిళనాడులోని మదురైకి చెందిన ఓ యువకుడు పడరాని పాట్లు పడుతున్నాడు. ఆమ్మాయి వేషంలో ఉదయం తెలిసిన వారి ఇళ్లలో పాచిపనులు చేస్తున్నాడు. గత ఆరు నెలలుగా ఇలానే చేస్తూ పొట్టపోసుకుంటున్న అతడి ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయ్యాయి.
శివగంగై జిల్లా మానామదురై గ్రామానికి చెందిన అతడి వయసు 40 ఏళ్లు. ఊరి నుంచి ప్రతి రోజు బస్సులో లుంగీ, షర్టుతో మదురై చేరుకుంటాడు. అక్కడ ఎవరూ కనిపించని ప్రదేశంలో లుంగీ, షర్ట్ విప్పేసి తలకు విగ్ ధరించి ఆడవేషం వేస్తాడు. అనంతరం ఆ ప్రాంతంలోని మూడు ఇళ్లకు వెళ్లి పాచిపనులు పూర్తిచేసుకుని మళ్లీ అదే ప్రాంతానికి వస్తాడు. ఆ దుస్తులు విప్పేసి మళ్లీ మగాడిగా మారిపోయి ఇంటికి వెళ్లిపోతాడు.
గత కొంతకాలంగా అతడి వేషాలను చూస్తున్న ఆ ప్రాంత ప్రజలు అనుమానించారు. తాజాగా అతడిని పట్టుకుని నిలదీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన పేరు రాజా అని, రాజాత్తిగా పేరు మార్చుకుని ఇంటి పనులు చేస్తున్నానని చెప్పడంతో వారు షాకయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఇంతకుమించిన మార్గం కనిపించలేదని వాపోయాడు. తనకు పెళ్లి కాలేదని, తాను పనిచేస్తున్న ఇళ్లవారు ఇప్పటి వరకు తనను అనుమానించలేదని చెప్పుకొచ్చాడు. ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం బయటపడుతుందని తనకు తెలుసని, అయినప్పటికీ తన పరిస్థితి తెలిసిన తర్వాత ఎవరూ తనను పనిలోంచి తీసేయరన్న నమ్మకం ఉందని రాజా పేర్కొన్నాడు.