Chandrababu: వాయిదా పడిన చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ... అప్పట్లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు!
- చంద్రబాబు అక్రమాస్తులు కలిగివున్నాడని లక్ష్మీపార్వతి ఆరోపణ
- 2005లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు
- హైకోర్టులో స్టే తెచ్చుకున్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి అప్పట్లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు 14 ఏళ్ల క్రితం దాఖలైంది. దీనిపై విచారణ ప్రారంభం కాక ముందే తన వాదనలు కూడా వినాలంటూ చంద్రబాబునాయుడు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. కానీ ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన హైకోర్టుకు వెళ్లగా, అక్కడ స్టే లభించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ స్టే గడువు ముగిసింది. దీంతో ఈ కేసుపై న్యాయస్థానం ఇటీవల తిరిగి విచారణను మొదలెట్టింది.
ఈ కేసులో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా, తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారంటూ లక్ష్మీపార్వతి కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటివరకు విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.