Beeda Masthan Rao: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు
- నిన్ననే టీడీపీకి రాజీనామా చేసిన మస్తాన్ రావు
- చంద్రబాబుకు రాజీనామా లేఖ
- మస్తాన్ రావును వైసీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
నెల్లూరు జిల్లా టీడీపీలో ఇన్నాళ్లు కీలకనేతగా ఉన్న బీద మస్తాన్ రావు తాజాగా వైసీపీలో చేరారు. నిన్ననే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మంత్రి అనిల్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు.
నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే అయిన బీద మస్తాన్ రావు ఎన్నికల తర్వాత టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా పాల్గొనడంలేదు. దాంతో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పంపారు.
ఇటీవలే సీఎం జగన్ హాజరైన ఆక్వా రైతుల సదస్సులో బీద మస్తాన్ రావు కూడా కనిపించడం పార్టీ మారతారన్న ప్రచారానికి ఊతమిచ్చింది. గత ఎన్నికల్లో మస్తాన్ రావు నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. మస్తాన్ రావు సోదరుడు బీద రవిచంద్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు.