nirbhaya accused: నా క్షమాభిక్ష పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వండి: నిర్భయ నేరస్తుడు
- క్షమాభిక్ష పిటీషన్ పై తాను సంతకం చేయలేదన్నశర్మ
- త్వరలోనే నలుగురికి ఉరి శిక్ష అమలు
- అత్యాచార కేసుల క్షమాభిక్షలపై రాష్ట్రపతి విముఖత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో ఉరిశిక్ష పడ్డ దోషుల్లో వినయ్ శర్మ వ్యవహారం సంచలనం రేపుతోంది. వినయ్ శర్మ తరపున క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వద్దకు పిటిషన్ చేరినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాను ఏ క్షమాభిక్ష పిటిషన్ పైనా సంతకం చేయలేదని, దానిపై ఉన్న సంతకం కూడా తనది కాదని అతను పేర్కొన్నాడు. దయచేసి తన పేరున ఉన్న పిటిషన్ ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని రాష్ట్రపతిని కోరాడు.
అత్యాచార ఘటనలకు సంబంధించిన నేరస్తులకు క్షమాభిక్ష పెట్టకూడదని శుక్రవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చెప్పడంతో, వినయ్ శర్మ పిటిషన్ ఉపసంహరణ వేడుకోలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులకు గాను ఒకరు మైనరు కావడంతో అతనికి జువైనల్ కోర్టు 3 సంవత్సరాల శిక్షను విధించింది. అతను శిక్షను పూర్తి చేసుకుని విడుదలయ్యాడు. రామ్ సింగ్ అనే మరొక దోషి 2013లోనే జైలులో ఉరి వేసుకుని మరణించాడు. మిగిలిన నలుగురిని త్వరలోనే ఉరి తీయాల్సి ఉంది.