trump: చైనా వద్ద చాలా డబ్బు ఉంది, ఇంకా రుణమెందుకు?: ప్రపంచబ్యాంకుపై ట్రంప్ మండిపాటు
- చైనాకు రుణాలు ఇవ్వొద్దంటూ అంతర్జాతీయ సంస్థలను కోరిన అమెరికా
- ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచనున్న ట్రంప్ ట్వీట్లు
- ఇప్పటికే చైనాకు రుణాన్ని తగ్గిస్తూ వస్తున్న వరల్డ్ బ్యాంక్
చైనా వద్ద చాలా డబ్బు ఉందని, ఇంకా వారికి ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వడమేమిటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో మండిపడ్డారు. ప్రపంచంలోనే రెండు పెద్ద అర్థిక వ్యవస్థలు అయిన అమెరికా, చైనాలు తమ మధ్య ఏర్పడిన వాణిజ్య యుద్ధ వాతావరణాన్ని చల్లబర్చడానికి ఓవైపు పాక్షిక ఒప్పందాలను ఏర్పరచుకునే పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ తనదైన శైలిలో చైనా విషయంలో వరల్డ్ బ్యాంకుపై మండి పడడం ఆసక్తిగా మారింది.
చైనా వద్ద చాలా డబ్బు ఉందని, అయినా వారికి ఇంకా వరల్డ్ బ్యాంకు అప్పు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని, ఒకవేళ వారి దగ్గర లేకపోయినా సృష్టించుకోగలరని ట్రంప్ పేర్కొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలకు గాను చైనాకు తక్కువ వడ్డీకి 1.5 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు సన్నాహాలు చేస్తోంది.
నిజం చెప్పాలంటే చైనాకు రుణాన్ని ప్రపంచబ్యాంకు ఇటీవల కాలంలో 2.4 నుంచి 1.3 బిలియన్ డాలర్లకు తగ్గిస్తూ వస్తోంది. అయినా ట్రంప్ చైనాను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. పైగా అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి చైనా చేపట్టే దీర్ఘకాలిక ప్రాజెక్ట్ లకు రుణాలు ఇవ్వొద్దని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రపంచ స్థాయి సంస్థలను కోరినట్లు తెలపడం విశేషం.