Income tax: దేశవ్యాప్తంగా షేర్ బ్రోకర్లపై ఐటీ దాడులు.. రూ.1.20 కోట్ల సీజ్
- ఢిల్లీ, హైదరాబాద్ సహా 39 ప్రాంతాల్లో సోదాలు
- షేర్ బ్రోకర్లు, వ్యాపారులే లక్ష్యంగా దాడులు
- తప్పుడు విధానం ద్వారా యోగ్యత లేని సంస్థలకు లబ్ధి
షేర్ బ్రోకర్లు, వ్యాపారులపై ఆదాయపన్ను శాఖ అధికారులు నిన్న దాడులు నిర్వహించారు. కోల్‌కతా, కాన్పూర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఘజియాబాద్ సహా దేశంలోని 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కృత్రిమ లాభ నష్టాలను సృష్టించడం కోసం బ్రోకర్లు అతి తక్కువ సమయంలోనే రివర్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నట్టు తేలిందని దాడుల అనంతరం ఆదాయపన్ను శాఖ తెలిపింది.
ఈ విధానం ద్వారా ఆయా సంస్థలు రూ.3500 కోట్లకు పైగా లాభనష్టాలను నమోదు చేశాయని అధికారులు అంచనా వేశారు. ఈ మోసపూరిత విధానం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి ప్లాట్ ఫార్మ్ మీద నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం మాత్రమే కాకుండా, కృత్రిమ నష్టాలు నమోదుచేయడం ద్వారా పన్ను ఎగవేతలకు ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. అలాగే, లెక్కలు చూపించని రూ.1.20 కోట్ల నగదును సీజ్ చేసినట్టు తెలిపింది. ఇలాంటి లావాదేవీల ద్వారా ప్రయోజనం పొందేవారు వేలల్లో ఉండే అవకాశం ఉందని, వారిని గుర్తిస్తున్నట్టు అధికారులు తెలిపారు.