Cock: పందెంకోళ్లు పోతున్నాయ్... మింగలేక, కక్కలేక వాపోతున్న పెంపకందారులు!
- మరో నెలలో సంక్రాంతి సీజన్
- బరుల్లో దిగేందుకు సిద్ధమవుతున్న కోళ్లు
- పలు ప్రాంతాల్లో దొంగతనాలు
- రాత్రుళ్లు కోళ్లకు కాపలాగా ఉంటున్న పెంపకందారులు
మరో నెల రోజులు... సంక్రాంతి పండగ సీజన్ వచ్చేస్తుంది. సంక్రాంతి సరదా అంటే కోనసీమలోనే చూడాలి. ముఖ్యంగా కోళ్ల పందాల బరుల వద్ద ఉండే హడావుడి, వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే జనం, వారి కోసం బరుల నిర్వాహకులు చేసే ఏర్పాట్లు, ఆ సందడి అంతా ఇంతా కాదు. కోళ్ల పెంపకందారులు ఓ వైపున పందాలకు కోళ్లను సిద్ధం చేస్తుంటే, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు కొత్త సమస్య వచ్చి పడింది. అదే పందెం కోళ్ల దొంగతనం.
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మాధ్యమంగా కోళ్లను ముందుగానే విక్రయానికి ఉంచడంతో, ఏ విధమైన కోడి, ఎవరి దగ్గర, ఎక్కడ ఉందన్న విషయం దొంగలకు ముందుగానే తెలిసిపోతోంది. దీంతో వారు రాత్రిపూట గోడదూకేసి, తమకు అందిన కోళ్లను దొంగిలించుకు పోతున్నారు. కోళ్లను అధికంగా పెంచే పంగిడిగూడెం, పోలసాని పల్లి గ్రామాల్లో జరుగుతున్న వరుస చోరీలు, పెంపకందారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
పందెం కోళ్ల పెంపకం చట్ట విరుద్ధం కావడంతో, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు లేక, వారంతా మింగలేక, కక్కలేక, కోళ్ల దొంగతనాలను ఆపేందుకు స్వయంగా రంగంలోకి దిగి, రాత్రిళ్లు నిద్ర మేలుకుని కాపలా ఉంటున్నారు. కొంతమంది పోలీసులను ఆశ్రయించి, కేసులు నమోదు చేయకుండా, దొంగలను పట్టుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి.