Onion: ఉల్లి డబుల్ సెంచరీ... బెంగళూరులో కిలో రూ. 200!
- ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి ధరలు
- హోల్ సేల్ మార్కెట్లో రూ. 14 వేలు దాటిన ఉల్లి ధర
- వర్షాల కారణంగా 50 శాతం తగ్గిన పంట
ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్లాయి. బెంగళూరుకు రావాల్సిన ఉల్లిపాయల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో, కిలో ఉల్లి ధర ఏకంగా రూ. 200కు చేరింది. "రిటైల్ షాపుల్లో ధరలు మరింతగా పెరిగాయి. హోల్ సేల్ వ్యాపారులు క్వింటాలుకు రూ. 14 వేలు పెట్టి ఉల్లిని కొనుగోలు చేయాల్సి వస్తోంది" అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ ఆఫీసర్ సిద్ధనాగయ్య వ్యాఖ్యానించారు.
ఇక బెంగళూరులోని రెస్టారెంట్లు ఇప్పటికే ఉల్లిపాయల వాడకాన్ని ఆపివేయగా, ప్రజలు కూడా వాడకాన్ని తగ్గించేశారు. ఇండియాకు సాలీనా 150 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల అవసరం ఉండగా, కర్నాటకలోనే ఏటా 20. 9 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండుతుంది. అయితే, ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం పంట వర్షార్పణం అయింది. దీంతో మార్కెట్లో డిమాండ్, సరఫరాల మధ్య సమతుల్యత దెబ్బతిందని వ్యాపారులు అంటున్నారు.
నవంబర్ లో కర్ణాటక మార్కెట్ కు రోజుకు 60 నుంచి 70 క్వింటాళ్ల పంట రాగా, ఇప్పుడది 30 నుంచి 35 క్వింటాళ్లకు పడిపోయింది. ఇక ఉల్లి ధరలను దించేందుకు ఏపీఎంసీ (అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ) రంగంలోకి దిగి, సెలవు దినాల్లోనూ ఉల్లి లావాదేవీలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, హోల్ సేలర్లు, రిటెయిలర్ల వద్ద సరిపడా ఉల్లిపాయల నిల్వలు లేవని, అసలు కర్ణాటకలో ఉల్లిపాయలు నిల్వ చేసుకునేందుకు స్టోరేజ్ వసతులు కూడా లేవని సిద్ధనాగయ్య వ్యాఖ్యానించడం గమనార్హం.