New Delhi: ఢిల్లీలో విషాదం : అనాజ్ మండీ అగ్నిప్రమాదంలో 43 మంది మృతి
- మరో 20 మందికి తీవ్రగాయాలు
- మంటల్లో చిక్కుకున్న బహుళ అంతస్తుల భవనం
- పొగతో ఊపిరాడక పలువురు మృత్యువాత
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారు జామున ఝాన్సీరోడ్డులోని అనాజ్ మండీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మృతి చెందగా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరో యాభై మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఇంకో 20 మంది భవనంలో చిక్కుకున్నారని గుర్తించిన సిబ్బంది వారిని ప్రాణాలతో రక్షించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. స్కూలు బ్యాగులు, బాటిళ్లు, ఇతర చిన్నచిన్న సామగ్రి తయారు చేసే కుటీర పరిశ్రమ ఈ భవనంలో ఉన్నట్లు సమాచారం. ఈ భవనంలో తెల్లవారు జామున 5.22 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఆ సమయానికి కార్మికులంతా నిద్రలో ఉండడంతో ఊపిరాడక నిద్రలోనే చాలామంది చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ కారణంగానే ప్రాణనష్టం అధికంగా జరిగిందని చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువమంది కార్మికులేనని తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.