unnao: ముఖ్యమంత్రి వచ్చి పరామర్శిస్తేనే తమ అమ్మాయి అంత్యక్రియలు చేస్తామంటోన్న 'ఉన్నావో' బాధిత కుటుంబం
- యోగి ఆదిత్యానాథ్ వెంటనే స్పందించాలి
- నేరస్థులను ఎన్కౌంటర్ చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్యలు కూడా తీసుకోవట్లేదు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో అత్యాచార బాధితురాలి మృతిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వెంటనే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వచ్చే వరకు తమ కూతురు అంత్యక్రియలు నిర్వహించబోమని బాధితురాలి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
హైదరాబాద్లో దిశ ఘటనలో నిందితుల మాదిరిగా ఉన్నావో నేరస్థులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులకు మద్దతుగా స్థానికులు కూడా నిరసన తెలుపుతున్నారు. ఇటువంటి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదని, బాధితులకు న్యాయం చేయట్లేదని విమర్శించారు.
కాగా, ఉన్నావోకు చెందిన ఆ యువతిపై గతేడాది పెళ్లి పేరుతో ఓ యువకుడు అత్యాచారం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఆ మృగాడు బెయిల్ పై బయటకు వచ్చాడు. కోర్టు విచారణ నిమిత్తం బాధితురాలు ఒంటరిగా బయలుదేరిన విషయాన్ని గుర్తించి.. ఆ సమయంలో బాధితురాలిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. వారు ఆమె ఒంటికి నిప్పంటించడంతో ఆసపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.