Cheating: పూజల పేరుతో ఘరానా మోసం : యువతికి రూ.5 లక్షలకు టోకరా
- జాతకంలో దోషాలున్నాయని వల
- ప్రత్యేక కార్యక్రమాలు చేస్తే తొలగిపోతాయని నమ్మబలికిన వైనం
- నిజమే అనుకున్న యువతి
‘మన బలహీనతే ఎదుటి వారి బలం’...మోసగాళ్ల సూత్రం ఇదే. ఎదుటి వారి బలహీనతను ఆసరాగా చేసుకుని వారిని ఏదో రూపంలో దోచుకోవడం వీరి పని. తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఘరానా మోసం ఈ కోవకే వస్తుంది. జాతకంలో దోషం ఉండడం వల్లే పెళ్లి కాలేదంటూ ఓ యువతి నుంచి లక్షలు దోచుకున్న మోసం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు...విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని అయోధ్యనగర్లో నివాసం ఉంటున్న పరిమి సాయిప్రియాంక తండ్రి చనిపోయాడు. తల్లితో కలిసి ఉంటోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కలిసి రాకపోవడంతో ఎవరైనా జ్యోతిష్కుడికి చూపించాలని ప్రియాంకకు పలువురు సూచించారు.
దీంతో కృష్ణలంక పాతపోస్టాఫీసు రోడ్డు బియ్యపుకొట్ల బజారులో ఉండే శ్రీశారద సనత్చంద్ర అనే జ్యోతిష్కుడిని కలిసి తన సమస్య చెప్పుకుంది. ఆమె జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కుడు పలు దోషాలున్నాయని చెప్పి శాంతిపూజ జరిపించాలన్నాడు. ఇందుకోసం గత సెప్టెంబర్ 23న ఆమె నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. కొన్ని పూజలు చేసిన అనంతరం తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న ఓ అమ్మవారి గుడిలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పి మరో రూ.2.82 లక్షలు తీసుకుని ఆమెను అక్కడికి తీసుకువెళ్లాడు.
ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించి పంపేశాడు. అంతేకాకుండా ముగ్గురు ముత్తయిదువులకు దానం చేస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటూ తన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళతోపాటు తన కుటుంబీకులు మరో ఇద్దరికి రూ.70 వేలు ఇప్పించాడు. ఆ తర్వాత మరో పూజ చేయాలని, ఇందుకు మరో లక్ష అవుతుందని చెప్పాడు.
తనవద్ద మరి డబ్బు లేదని చెప్పడంతో ఈ పూజ చేయకుంటే ఇప్పటి వరకు చేసిన పూజ వ్యర్థమవుతుందని చెప్పి అప్పు ఇప్పిస్తానంటూ సిద్ధపడ్డాడు. ఇందుకోసం చెక్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని ఎటువంటి పూజలు చేయంచకుండా ముఖం చాటేశాడు.
ఆమె ఫోన్ చేస్తే అసభ్యంగా తిడుతూ, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు మొదలు పెట్టాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన యువతి నిన్న కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.