Pawan Kalyan: ఏయ్, అరవకు... పద్ధతా ఇది!... కార్యకర్తలపై సహనం కోల్పోయిన పవన్ కల్యాణ్
- తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన
- మండపేటలో రైతులతో సమావేశం
- భారీగా హాజరైన జనసైనికులు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సభకు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాంతో సభా ప్రాంగణం అరుపులు, కేకలు, ఈలలతో ఇబ్బందికరంగా మారింది. పవన్ చెప్పేది కూడా వినిపించనంత స్థాయిలో కార్యకర్తల కోలాహలం నెలకొంది. దాంతో జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికుల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని అసహనంతో వ్యాఖ్యానించారు.
"మీకే చెప్పేది... దయచేసి ఈలలు, చప్పట్లు ఆపాలి. మీరిలా అరుస్తుంటే నేనొచ్చిన పని జరగదు! నేనో పార్టీని నడుపుతున్నా, సమస్యలు వినాలి. ఏయ్ అరవకు... నీకే చెప్పేది, పద్ధతా ఇది! మీరు క్రమశిక్షణతో ఉంటే నేను ఓడిపోయేవాడ్ని కాదు. రైతన్న కష్టాలు గురించి మాట్లాడుతుంటే మీరు అరుస్తుంటే ఎలా? క్రమశిక్షణ లేకపోతే మీరేం చేయలేరు" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.