Russia out from 2020 Olympics: రష్యా అథ్లెట్లపై నాలుగేళ్ల నిషేధం.. 2020 ఒలింపిక్స్ నుంచి ఔట్
- ‘వాడా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ విచారణలో ఏకగ్రీవంగా నిర్ణయం
- డోపింగ్ నివేదికలను మార్చాలని చూసిన రష్యాపై ఆగ్రహం
- ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలకూ దూరమైన రష్యా
టోక్యో ఆతిథ్యమిస్తున్న 2020 ఒలింపిక్స్ కు రష్యా దూరమైంది. డోపింగ్ పరీక్షల్లో రష్యా క్రీడాకారులు దొరికిపోవడంతో ఆ దేశ జట్టుపై నాలుగేళ్ల నిషేధాన్ని విధిస్తూ.. ‘వాడా’(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) ఆదేశాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో రష్యా వచ్చే ఏడాది టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్ క్రీడల నుంచే కాక వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు కూడా రష్యా జట్టు దూరమయింది. ఈ మేరకు వాడా అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. రష్యా అథ్లెట్లు డోపింగ్ కు సంబంధించి సమర్పించాల్సిన లాబొరేటరీ నివేదికలను మార్చాలని ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు.
డోపింగ్ లో పాజిటివ్ గా వచ్చిన నివేదికలను మార్చి నకిలీ నివేదికలను సమర్పించారని.. వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ జరిపిన విచారణలో తేలిందని ఆయన చెప్పారు. దీంతో రష్యాపై వేటును వేస్తూ.. కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. రష్యాపై నిషేధం విధించినప్పటికీ.. ఆ దేశ అథ్లెట్లు మేజర్ అంతర్జాతీయ ఈవెంట్లలో తమ దేశ జెండా, జాతీయగీతాలాపన లేకుండా పాల్గొనే వెసులు బాటు ఉంటుంది. 2015 నుంచి రష్యా అథ్లెట్లు డోపింగ్ కుంభకోణంలో చిక్కుకున్నారు. వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలను వాడా సేకరించిన విషయం తెలిసిందే.