Vallabhaneni Vamsi: టీడీపీతో కొనసాగలేను.. ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: స్పీకర్ ను కోరిన వల్లభనేని వంశీ
- ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను బూతులు తిట్టించారు
- సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా నాకు చెప్పలేదు
- ఇకపై నన్ను టీడీపీ సభ్యుడిగా చూడవద్దు
ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం చేస్తున్న పనులను కొంత మేర సమర్థించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధిష్ఠానంతో తాను చెప్పానని... తన మాటలను వినకపోగా ప్రెస్ మీట్లు పెట్టించి తనను బూతులు తిట్టించారని అన్నారు. సోషల్ మీడియాలో తనను వ్యక్తిగతంగా తిట్టించారని చెప్పారు. ఆ తర్వాత తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని... ఆ విషయాన్ని కూడా తనకు నేరుగా చెప్పలేదని... ప్రసార మాధ్యమాల ద్వారానే ఆ విషయాన్ని తాను తెలుసుకున్నానని తెలిపారు. శాసనసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలో కొనసాగే పరిస్థితి తనకు లేదని వంశీ చెప్పారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనను ఎన్నుకున్నారని... వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. ఇకపై తనను టీడీపీ సభ్యుడిగా చూడవద్దని... ప్రత్యేక సభ్యుడిగా తనను గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా తన హక్కులను కాపాడాలని విన్నవించారు.