Prasant Kishor: జేడీయూ నిర్ణయం నిరాశను కలిగించింది: ప్రశాంత్ కిశోర్
- పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం నిరాశకు గురి చేసింది
- పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉంది
- సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించిన ప్రశాంత్ కిశోర్
తన సొంత పార్టీ జేడీయూపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం తనను నిరాశకు గురి చేసిందని ఆయన అన్నారు. మతం ఆధారంగా వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే ఈ బిల్లు... పౌరసత్వ హక్కుకు తూట్లు పొడిచేలా ఉందని చెప్పారు. గాంధేయవాద ఆదర్శాలతో రూపొందించిన పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందని తెలిపారు.
లౌకికవాద పార్టీ ఈ బిల్లుకు మద్దతు పలకడం నిరాశకు గురి చేసిందని ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్... ప్రస్తుతం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు. ఆయన జేడీయూ నేతగా ఉన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నిర్ణయంపైనే ఆయన విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.