Telugudesam criticism against speaker Tammineni: శాసనసభ నిర్వహణ తీరుపై టీడీపీ నేతల అసంతృప్తి
- గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారు?
- వంశీ పార్టీ మారాలంటే రాజీనామా చేసి వెళ్లవచ్చని సూచన
- స్పీకర్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శ
ఏపీ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాట్లాడించడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. శాసనసభ నిర్వహణ తీరును ఆ పార్టీ నేతలు ఆక్షేపించారు. టీడీఎల్పీ ఉపనేత బుచ్చయ చౌదరి, పార్టీ సీనియర్ నేత చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. నిబంధన 38 ప్రకారం ప్రశ్నోత్తరాలు నడపాలని కోరారు. సభా సంప్రదాయాలకు భిన్నంగా వంశీకి స్పీకర్ తమ్మినేని మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారని విమర్శించారు.
వంశీ పార్టీ మారాలంటే రాజీనామా చేసి వెళ్లవచ్చని తెలిపారు. స్పీకర్ వంశీని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారు? అని ప్రశ్నించారు. స్పీకర్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు. హైదరాబాద్ లోని భూములను కాపాడుకోవడం కోసమే వంశీ టీడీపీని వీడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. మంత్రులు సభలో దురుసుగా మాట్లాడుతుంటే అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు.