BJP MP Soyam Bapurao and Aravind comments: పౌరసత్వ సవరణ బిల్లుపై టీఆర్ఎస్ కు అవగాహన లేదు: బీజేపీ ఎంపీలు సోయం, అరవింద్
- ముస్లింలకు భయపడే బిల్లుకు మద్దతు ఇవ్వలేదు
- ఎంఐఎంకు భయపడే హిందువులకు వ్యతిరేకంగా వెళుతున్నారంటూ ఆరోపణ
- విదేశాల్లో హిందువులపై జరిగే దాడులు టీఆర్ఎస్ కు కనిపించవా ? అని ప్రశ్నించిన ఎంపీలు
పౌరసత్వ సవరణ బిల్లుపై టీఆర్ఎస్ కు అవగాహన లేదని బీజేపీ ఎంపీలు అరవింద్, సోయం బాపూరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో.. ముస్లింలకు భయపడే బిల్లుకు మద్దతీయలేదని ఆరోపించారు. ముస్లింలకు వ్యతిరేకంగా మద్దతీయని టీఆర్ఎస్ కు ఇతర దేశాల్లో హిందువులపై జరిగే దాడులు కన్పించవా? అని ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడే హిందువులకు వ్యతిరేకంగా వెళుతున్నారన్నారు. లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన అనంతరం.. ఎంపీలు అరవింద్, సోయం బాపూరావులు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ చేసిన పాపాల నుంచి విముక్తి కలిగేలా ఈ బిల్లు ఉందన్నారు. ఈ బిల్లుపై తాము ఓటింగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా బిల్లులో ఏమున్నా.. మేము బిల్లును సమర్థించమని టీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్దూరంగా ఉందని ఎంపీ అరవింద్ అన్నారు.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ లో హిందువులను హింసిస్తే వారి బాధలు మీకు కనిపించవా? అని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. హిందువుల ఓట్లతో మీరు గెలవలేదా? అని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుపై టీఆర్ఎస్ కు అవగాహన లేక దాన్ని వ్యతిరేకించడాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఎంఐఎం తానా అంటే టీఆర్ఎస్ తందానా అన్నట్లుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ప్రజలను బాధలనుంచి రక్షించే పార్టీ తమదని సోయం చెప్పుకొచ్చారు.