Chandrababu: ప్రతిపక్షనేతగా చంద్రబాబు అడగడంలో తప్పులేదు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- ఉల్లి సమస్యపై వైసీపీ ప్రభుత్వం దృష్టిసారించాలి
- ప్రజలు ఇబ్బంది పడుతుంటే పరస్పర దూషణలా?
- సమస్యను జగన్, బాబు పక్కదోవ పట్టిస్తున్నారు
ఏపీలో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉల్లిధరల విషయమై నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయమై ఓ ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు ప్రశ్నించడంలో, సలహా ఇవ్వడంలో తప్పేముందని అన్నారు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ అని సీడీఎస్ సర్వే ఈ మధ్య తెలిపిందని, ఇదే సర్వేలో అత్యంత ధనవంతుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అని కూడా పేర్కొందని ఆయన తెలిపారు.
అయితే, వ్యాపారాలు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు కానీ, ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వీళ్లిద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగుతూ సమస్యను పక్కదోవపట్టిస్తున్నారని, శాసనసభా సమావేశాల్లో సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత దూషణలను పక్కనబెట్టి రాష్ట్రంలో నెలకొన్న ఉల్లి సమస్యపై వైసీపీ ప్రభుత్వం దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.