Chandrababu: ఇచ్చిన మాట తప్పి, ప్రజలపై రోజుకో బండ పెడుతున్న వైఎస్ జగన్: చంద్రబాబు నిప్పులు!
- ఎన్నికలకు ముందు ఏ చార్జీలనూ పెంచబోమన్నారు
- ఇప్పుడు మాట తప్పి ఆర్టీసీ చార్జీల వడ్డన
- వెంటనే వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట వైఎస్ జగన్ గుదిబండలా మారారని మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన మాట తప్పారని, ప్రజలపై ఎటువంటి భారమూ పడనివ్వబోనని, ఏ చార్జీలు పెంచబోనని హామీ ఇచ్చి, ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం పెంచిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ, వెలగపూడిలో ధర్నా చేపట్టగా, చంద్రబాబు ప్రసంగించారు.
రాష్ట్ర ప్రజలపై రోజుకో బండను పెడుతున్న జగన్ సర్కారుకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. రోజుకో సమస్యను ప్రజలపై మోపుతున్నారని, ఇసుక నుంచి ఆర్టీసీ వరకూ అన్నీ సమస్యలేనని దుయ్యబట్టారు. అసెంబ్లీ జరుగుతుండగా, సభ అనుమతి లేకుండా, సభలో చర్చించకుండా చార్జీలను పెంచడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.