YSR: వైఎస్ఆర్ నే చూశాం... జగన్ మాకో లెక్కా?: లోకేశ్
- అడ్డగోలు విమర్శలు చేస్తున్నా అడ్డుకోవడం లేదు
- రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం
- ఇకపై మరింతగా కష్టపడతామన్న లోకేశ్
తాను సభ్యుడిగా లేని అసెంబ్లీలో తనపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని ఏ మాత్రమూ అడ్డుకోవడం లేదని, తనపై చేసిన విమర్శలను రికార్డుల నుంచి తొలగించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజకీయాలు చేస్తున్న వారికి గెలుపు, ఓటములు సహజమని, వైఎస్ రాజశేఖరెడ్డినే చూసిన తమకు వైఎస్ జగన్ ఓ లెక్కా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఓడిపోయినందుకు తామేమీ బాధపడటం లేదని, ఇప్పుడు మరింత కష్టపడి, ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. తమకు 40 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేసిన లోకేశ్, అటువంటి పార్టీ ఎక్కడికి వెళుతుందని ప్రశ్నించారు. జగన్ దగ్గర భజన చేసేందుకు ప్రత్యేకమైన బ్యాచ్ ఉందని, ఒక లైక్ కొడితే మూడు రూపాయలు ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆ భజన బ్యాచ్, తమ పనిని బాగా చేస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీని వదిలేసిన వంశీని సస్పెండ్ చేశామని, ఇంకా ఆయన గురించి మాట్లాడేదేముంటుందని అన్నారు.