hockey india: మైదానంలో హాకీ కర్రలతో కొట్టుకున్న ఆటగాళ్లు.. 11 మంది ఆటగాళ్లపై వేటు!
- 56వ నెహ్రూ కప్ హాకీ ఫైనల్‌లో గొడవ
- తీవ్రంగా పరిగణించిన హాకీ ఇండియా
- ఆరు నెలల నుంచి 18 నెలలపాటు సస్పెన్షన్
మైదానంలో తలపడుతున్న ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వివాదం తలెత్తడంతో హాకీ కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్న 11 మంది హాకీ క్రీడాకారులను హాకీ ఇండియా సస్పెండ్ చేసింది. ఇటీవల జరిగిన 56వ నెహ్రూ కప్ హాకీ ఫైనల్‌లో పంజాబ్ సాయుధ పోలీసులు, పంజాబ్ బ్యాంకు జట్లు తలపడ్డాయి. మ్యాచ్ జరుగుతుండగా తలెత్తిన చిన్న వివాదం పెద్దదైంది. దీంతో ఆట మానేసి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. హాకీ కర్రలతో మైదానంలో బాహాబాహీకి దిగారు. హాకీ స్టిక్స్‌తో ఇష్టానుసారం దాడిచేసుకున్నారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హాకీ ఇండియా నివేదిక కోరింది. నివేదికలు, వీడియో సాక్ష్యాలను పరిశీలించిన హాకీ ఇండియా రెండు జట్లకు సంబంధించిన 11 మంది ఆటగాళ్లపై వారు చేసిన నేరాన్ని బట్టి 12-18 నెలలు, 6-12 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ నెల 11 నుంచి శిక్ష అమలు కానుంది. పంజాబ్ సాయుధ పోలీసులకు చెందిన ఇద్దరిని 18 నెలలు, ఐదుగురిని 12 నెలలపాటు సస్పెండ్ చేసింది. పోలీసు జట్టు మేనేజర్ బల్విందర్ సింగ్‌పై 18 నెలల వేటుపడింది. పంజాబ్ బ్యాంకు ఆటగాళ్లలో ముగ్గురికి 12 నెలలు, ఒకరికి ఆరు నెలలు, మేనేజర్ సుశీల్ కుమార్ దూబేను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.