Nanigadu: హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట 'నానిగాడు' హీరో నిరసన!
- రూ. 40 లక్షలతో 'నానిగాడు' చిత్రం
- విడుదలకు ముందే యూట్యూబ్ లో లింక్
- తనకు న్యాయం చేయాలని దుర్గా ప్రసాద్ డిమాండ్
తాను హీరోగా నటిస్తూ, రూ. 40 లక్షల ఖర్చుతో 'నానిగాడు' సినిమాను నిర్మిస్తే, విడుదల కాకుండానే యూట్యూబ్ లో పెట్టారని ఆరోపిస్తూ, హైదరాబాద్, ఫిల్మ్ చాంబర్ ముందు చిత్ర హీరో దుర్గా ప్రసాద్ నిరసనకు దిగాడు. సినిమాను ఆన్ లైన్ లో ఉంచడంతో తనకు ఎంతో నష్టం కలిగిందని ఆయన ఆరోపించాడు.
సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికెట్ ఇచ్చిందని, విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఇంత దారుణానికి ఒడిగట్టారని ఆరోపించిన ఆయన, సినిమా లింక్ ను ఆన్ లైన్ లో ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తక్షణమే లింక్ ను తొలగించాలని, తమకు న్యాయం చేయాలని కోరిన దుర్గా ప్రసాద్, లేకుంటే సినిమా యూనిట్ మొత్తం ఫిల్మ్ చాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించాడు. జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు దుర్గా ప్రసాద్ వ్యాఖ్యానించాడు.