JDU: అధికారంలో కొనసాగడం కోసమే సీఎం నితీశ్ కుమార్ రాజీపడ్డారు: తేజస్వీ యాదవ్
- ఈ బిల్లు తీసుకురావడం పెద్ద డ్రామా
- దీనికి నితీశ్ మద్దతు తెలిపారు
- నితీశ్ కు వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం జేడీయూలో ఎవరికీ లేదు
లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన బీహార్ రాజధాని పాట్నాలో తమ పార్టీ నేతలతో కలిసి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ... 'ఈ బిల్లు తీసుకురావడం పెద్ద డ్రామా. దీనికి మద్దతు తెలిపిన నితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం జేడీయూలో ఎవరికీ లేదు. అధికారంలో కొనసాగడం కోసమే నితీశ్ కుమార్ రాజీపడి, ఈ బిల్లుకు మద్దతు తెలిపారు' అని వ్యాఖ్యానించారు. ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. బీహార్ లో బీజేపీ మద్దతుతో జేడీయూ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ బిల్లుకు నితీశ్ కుమార్ మద్దతివ్వడంపై జేడీయూ పార్టీలో అసమ్మతి చెలరేగినట్లు ప్రచారం జరుగుతోంది.