Disha: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును దర్యాప్తు చేయాలన్న సుప్రీం... నిరాకరించిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డి!
- సుప్రీంలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ
- వాదనలు విన్న సుప్రీం
- మాజీ జస్టిస్ తో దర్యాప్తుకు సిద్ధం!
సుప్రీం కోర్టులో నేడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు విచారణ జరిగింది. ఈ కేసును సుప్రీం మాజీ జడ్జితో దర్యాప్తు చేయించేందుకు అత్యున్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఈ మేరకు సుప్రీం మాజీ జస్టిస్ పీవీ రెడ్డిని సంప్రదించారు. అయితే ఆయన ఈ కేసును దర్యాప్తు చేసేందుకు విముఖత ప్రదర్శించారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వెల్లడించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను సుప్రీం మాజీ జస్టిస్ తో దర్యాప్తు చేయించాలన్నది తమ ప్రతిపాదన అని బోబ్డే పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న పిమ్మట, దర్యాప్తుపై సూచనలు, సలహాలను తెలియజేయాలంటూ తెలంగాణ సర్కారుకు సుప్రీం స్పష్టం చేసింది. ఆపై విచారణను రేపటికి వాయిదా వేశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, ఈ ఘటనపై తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఎస్ఏ బోబ్డే చెప్పారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని స్పష్టం చేశారు.