Ammarajyamlo cuddapah bidalu: ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలపై తుది నిర్ణయం రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డుదే: హైకోర్టు
- ఈ మూవీ ప్రివ్యూ చూసిన ప్రిలిమినరీ కమిటీ
- కొంత మందిని కించపరుస్తున్నట్టు ఉందన్న కమిటీ
- ఈ చిత్రంపై మేము జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం విడుదలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. న్యాయస్థానంలో విచారణ ముగిసింది. ఈ చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమా విడుదలపై తుది నిర్ణయం రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డుదే అని తెలిపింది.
ఈ మూవీ ప్రివ్యూ చూసిన ప్రిలిమినరీ కమిటీ సినిమా విడుదలకు అడ్డుచెప్పింది. కొంత మంది వ్యక్తులను కించపరుస్తున్నట్టు ఈ సినిమా ఉందని హైకోర్టుకు ప్రిలిమినరీ కమిటీ నివేదికలో పేర్కొంది.
కాగా, ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తీసేశామని కోర్టుకు చిత్ర బృందం తెలిపింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం అభ్యంతరకర సన్నివేశాలు తొలగించినట్టు ఎక్కడా లేదని, కేవలం మ్యూట్ లో మాత్రమే ఉంచారని, అలా చేస్తే సరిపోదని హైకోర్టు తేల్చి చెప్పింది.