Jana Sena: జనసేన పార్టీకి, తనకు మధ్య గ్యాప్ ఉందన్న ఎమ్మెల్యే రాపాక!
- పూర్తి స్థాయిలో ఇంగ్లీషు మీడియం వద్దంటున్న పవన్!
- ఇంగ్లీషు మీడియంను స్వాగతిస్తూ అసెంబ్లీలో రాపాక వ్యాఖ్యలు
- పవన్ తో రాపాకకు బెడిసిందన్న కథనాలు!
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయనను లక్ష్యపెట్టకుండా ఏపీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ ఇంగ్లీషు మీడియంను స్వాగతించడమే కాకుండా జగన్ పై ప్రశంసలు కురిపించారు.
దాంతో రాపాకకు, పవన్ కు మధ్య పొసగడంలేదన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై రాపాక స్వయంగా వివరణ ఇచ్చారు. జనసేన పార్టీతోనూ తనకు కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, పవన్ కల్యాణ్ కు, తనకు మధ్య అడ్డంకి ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే పవన్ కు తనకు మధ్య ఉన్న అడ్డంకి తొలగిపోతుందని అన్నారు.
ఎన్నికల్లో విజయం కోసం తాను ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించానని, తనలాగే జనసేన పార్టీలోనూ కమిటీలు ఏర్పాటు చేసివుంటే చాలామంది అభ్యర్థులు గెలిచేవారని రాపాక అభిప్రాయపడ్డారు. చాలామంది దళితులు ప్రైవేటు పాఠశాలల్లో చదవలేకపోతున్నారన్న ఆవేదన తనకుందని, అందుకే గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని వివరించారు.