Manchiryala: 'కట్నం తేకుంటే చచ్చిపో' అనగానే... పురుగుల మందు తాగి, మృతి చెందిన వివాహిత!

  • మంచిర్యాల సమీపంలో ఘటన
  • చికిత్స పొందుతూ మరణించిన ప్రసూన
  • మరో ప్రాణాన్ని బలిగొన్న కట్న పిశాచి

కట్న పిశాచి మరో ప్రాణాన్ని బలిగొని 11 నెలల చిన్నారిని తల్లి లేని బిడ్డను చేసింది. మంచిర్యాల సమీపంలోని దండేపల్లిలో జరిగిన ఘటనపై మృతురాలి కుటుంబీకులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2017లో ఆముదాల ప్రసూన అలియాస్ మహతి (21)కి తర్ర రాకేశ్ తో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ. 11 లక్షల నగదుతో పాటు రూ. 4 లక్షల బంగారం, అదనంగా మరో రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లను కట్నంగా ఇచ్చారు.

అయితే, పెళ్లి తరువాత అదనంగా మరో రూ. 5 లక్షలు కట్నం తేవాలని భర్త, అత్తమామలు వేధిస్తుండగా, విషయాన్ని తండ్రికి చెప్పుకుని బాధపడింది. తాను అదనపు కట్నం ఇచ్చుకునే పరిస్థితి లేదని ప్రసూన తండ్రి చెబుతుండేవాడు. గత సంవత్సరం ఆడబిడ్డకు ప్రసూన జన్మనివ్వగా, అప్పటి నుంచి వేధింపులు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో మరో పెళ్లికి రాకేశ్ సిద్ధపడటంతో పాటు, తనకు విడాకులు ఇవ్వాలంటూ ప్రసూనను గదిలో బంధించాడు. విషయాన్ని తండ్రికి చేరవేయడంతో రెండు వారాల క్రితం ఆయన వచ్చి, తన బిడ్డను పుట్టింటికి తీసుకెళ్లాడు.

ఆపై కూడా వదలని భర్త, పదేపదే ఫోన్ చేసి అదనపు కట్నం కోసం విసిగించాడు. తాను అడిగిన డబ్బు ఇవ్వకుంటే చచ్చిపోవాలని హెచ్చరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసూన, పురుగుల మందు తాగింది. ఆమెను గమనించిన కుటుంబీకులు తొలుత కరీంనగర్ లోని ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రసూన కన్నుమూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News